MI vs KKR: ఎట్టకేలకు హోంగ్రౌండ్లో బోణీ కొట్టిన ముంబై... 116 పరుగులకే KKR ఆలౌట్.! 3 d ago

IPL 2025 లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI)... కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో KKR పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై జట్టు IPL 18వ సీజన్‌కి బోణి కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్‌కతాను చిత్తుగా ఓడించి ముంబై తమ సత్తా చాటుకుంది. డెబ్యుటెంట్ అశ్విని కుమార్ బౌలింగ్ లో అద్భుతంగా రాణించి ముంబైకు మొదటి విజయాన్ని అందించాడు. KKR నెలకొలిపిన 117 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఈ ఓటమితో KKR జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున స్థానానికి పడిపోయింది.
వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన KKR బ్యాటర్లు.. ముంబై బౌలింగ్ ఎటాక్ కు నిలబడలేక పోయారు. తొలి ఓవర్లో వికెట్ తీయడం అలవాటుగా చేసుకున్న ట్రెంట్ బౌల్ట్.. ఈ మ్యాచ్‌లోనూ అదే రిపీట్ చేశాడు. తాను వేసిన రెండవ బంతికే సునీల్ నరైన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి జట్టుకు తొలి వికెట్ అందించాడు. ఆ తరువాతి ఓవర్లో కూడా దీపక్ చాహర్.. క్వింటన్ డికాక్‌ను ఔట్ చెయ్యడంతో.. KKR 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత కూడా ముంబై బౌలర్ల ధాటికి KKR బ్యాటర్లు నిలవలేకపోయారు. డెబ్యుటెంట్ అశ్విని కుమార్ వేసిన మొదటి బంతికే అజింక్య రహానే (11) క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కొంచెం నిలకడగా ఆడుతున్న అంగ్క్రిష్ రఘువంశీ (26) కూడా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఔట్ అయ్యి పెవిలియన్ కు చేరాడు. దీంతో పవర్ ప్లే లో KKR కనీస పరుగులు చెయ్యలేక పోయింది.
ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మనీష్ పాండే (19) కూడా అశ్విని కుమార్ ధాటికి వెనుతిరిగాడు. రింకు సింగ్ (17), ఆండ్రీ రస్సెల్ (5) కూడా నిలబడలేకపోయారు. ఒక దశలో కనీసం 100 పరుగులు కూడా చెయ్యలేదనుకున్న సమయంలో, రమణ్‌దీప్ సింగ్ మెరుపు బ్యాటింగ్ తో 22 పరుగులు చేశాడు. దీంతో KKR కనీసం 100 పరుగుల మార్క్ ని అయిన దాటకలిగింది.
అద్భుతమైన బ్యాటింగ్ పిచ్ లో KKR కనీస పరుగులు కూడా చెయ్యలేక పోయింది. ముంబై బౌలింగ్ కు KKR జట్టు కుప్పకూలిపోయింది. ముఖ్యంగా ఈ కొత్త డెబ్యుటెంట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అశ్విని కుమార్ అద్భుతంగా రాణించాడు.. కీలకమైన 4 వికెట్లు తీయడంతో KKR జట్టు 16.1 ఓవర్లలో 116 రన్స్‌కి ఆలౌట్ అయింది.
ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ 2, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విఘ్నేష్ పుతుర్, మిచెల్ శాంట్నర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
117 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంభై బ్యాటర్లు మొదటి రెండు ఓవర్లలో నిదానంగా ఆడిన… 3వ ఓవర్ నుండి రోహిత్ శర్మ హిట్టింగ్ మొదలు పెట్టాడు. దీంతో గత రెండు మ్యాచ్‌లలో సరిగ్గా రాణించలేక పోయిన ర్యాన్ రికెల్టన్ కూడా ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. రస్సెల్.. రోహిత్ శర్మ (13), విల్ జాక్స్ (16) వికెట్లు తీసిన కూడా KKR కి ఓటమిని తప్పించలేక పోయాడు.
రికెల్టన్ (62) వేగంగా అర్ధశతకం చెయ్యడంతో ఇక ముంబైకి విజయం ఖరారైంది. జాక్స్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 9 బంతుల్లో 27 పరుగులు చేసి 12.5 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాడు. దీంతో ఎట్టకేలకు ముంబై తన హోంగ్రౌండ్లో ఆడిన మ్యాచ్‌లో విజయం సాధించింది.
టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 PM ISTకు ప్రారంభంకానుంది.